కొలంబో: టీ20 వరల్డ్ కప్‌ను మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా విజయంతో ముగించింది. లీగ్ దశలోనే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించిన ఆసీస్.. గ్రూప్ సీలో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) ఒమన్‌తో జరిగిన నామామాత్రపు మ్యాచులో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన టోర్నీ చివరి మ్యాచులో పసికూన ఒమన్‌పై కంగారులు ప్రతాపం చూపించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో విధ్వంసం సృష్టించారు.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ ఆసీస్ బౌలర్ల దెబ్బకు 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వసీం అలీ (32), జతీంధర్ సింగ్ (17), కరణ్ సోనావాలే (12), హమ్మద్ మీర్జా (16) నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో ఒమన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మ్యాక్స్‌వెల్, బార్ట్లెట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోయినిస్, ఎల్లిస్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా కేవలం 9.4 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదిపడేసింది.
కెప్టెన్ మిచెల్ మార్ష్ (66) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 32) ధనాధన్ ఇన్సింగ్స్ ఆడి ఔట్ అయ్యాడు. హెడ్ ఔటైన ఇంగ్లీస్ (12)తో కలిసి కెప్టెన్ మార్ష్ ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చాడు. టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన బాధను పసికూన ఒమన్ చివరి మ్యాచులో తీర్చుకుంది ఆసీస్.
